కర్ణాటకలో వింత పెళ్లి.. ప‌రిణ‌య‌మాడిన అక్కాత‌మ్ముళ్లు!

  • పెళ్లికి ముందు పిన్ని కొడుకుతో పరారైన యువతి
  • మూడేళ్ల ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో సాహసం
  • రక్షణ కోరుతూ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన ప్రేమ జంట
  • కూతురి చర్యతో పోలీస్ స్టేషన్ వద్ద తల్లి గుండెలవిసేలా రోదన
  • కన్నవాళ్లతో వెళ్లేందుకు నిరాకరించి.. భర్తతోనే ఉంటానన్న యువతి
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఓ వింత ప్రేమకథ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు, వరుసకు తమ్ముడయ్యే సొంత పిన్ని కొడుకుతో లేచిపోయి పెళ్లి చేసుకోవడమే కాకుండా, తమకు రక్షణ కల్పించాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం సంచలనం రేపింది. మూడేళ్ల ప్రేమ కోసం కట్టుబాట్లను, రక్తసంబంధాన్ని కాదనుకుని ఈ జంట తీసుకున్న నిర్ణయం స్థానికంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

వివరాల్లోకి వెళితే... బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లికి చెందిన శశికళ, హోస్కోట్‌కు చెందిన ప్రవీణ్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి తల్లులు స్వయానా అక్కాచెల్లెళ్లు కావడంతో వరుసకు శశికళ అక్క, ప్రవీణ్ తమ్ముడు అవుతారు. ఈ విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజం అంగీకరించని ఈ బంధాన్ని వదులుకోవాలని హెచ్చరించారు. ఈ క్రమంలో శశికళ తల్లిదండ్రులు ఆమెకు వేరే యువకుడితో వివాహం నిశ్చయించి, పెళ్లి పత్రికలు కూడా పంచారు.

వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తికాగా, పెళ్లికి కొన్ని గంటల ముందు శశికళ తన ప్రియుడు ప్రవీణ్‌తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. అనంతరం అంగట్ట ప్రాంతంలోని ఓ శివాలయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తమకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని భయపడిన ఈ నూతన దంపతులు, రక్షణ కోరుతూ చిక్కబళ్లాపూర్ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న శశికళ తల్లిదండ్రులు కూడా అక్కడికి రావడంతో పోలీస్ స్టేషన్ ఆవరణలో హైడ్రామా చోటుచేసుకుంది.

"సొంత చెల్లెలి కొడుకునే పెళ్లి చేసుకున్నావా? వరుసకు తమ్ముడయ్యే వాడితో ఎలా కాపురం చేస్తావు? నీకు జన్మనిచ్చినందుకు నడిరోడ్డుపై మా పరువు తీశావు" అంటూ శశికళ తల్లి గుండెలవిసేలా రోదించింది. అయినప్పటికీ శశికల తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. "నాకు నా భర్త ప్రవీణే సర్వస్వం. నేను తల్లిదండ్రులతో వెళ్లను, అతనితోనే నా జీవితం" అని పోలీసుల ముందే స్ప‌ష్టం చేసింది. ప్రస్తుతం సామాజిక కట్టుబాట్లను, రక్తసంబంధాలను సవాల్ చేస్తూ జరిగిన ఈ వివాహం కన్నడనాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Karnataka
Shashikala
Karnataka marriage
Chikkaballapur
cousin marriage
love affair
family drama
social issues
arranged marriage
elope
Kannada news

More Telugu News